ముగించు

చరిత్ర

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.

 

కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోగడ కొత్తగూడెం పట్టణం ఖమ్మం జిల్లాలో రెవెన్యూ డివిజనుగా ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా శ్రీసీతారాములు దివ్యక్షేత్రం భద్రాద్రి పట్టణం (భద్రాచలం) గుర్తుగా జిల్లా పరిపాలన కేంద్రం కొత్తగూడెంగా ఉండేలాగున “భధ్రాద్రి” జిల్లాగా ప్రకటించి ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

                                   అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు, 377 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఖమ్మం జిల్లాకు చెందినవి.

భౌగోళికం:

ఈ జిల్లా వైశాల్యం 8,951 చదరపు కిలో మీటర్లు (3,456 చ. మై.)

జనాభా వివరాలు:

2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాలొ 1,304,811 మంది ఉన్నారు

జిల్లాలోని విద్యా సంస్థలు:

జిల్లాలోని అశ్వారావు పేట మండల కేంద్రంలో వ్యవసాయ విద్యా కళాశాల ఉంది. కొత్తగూడెంలో కాకతీయ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ కళాశాల ఉంది.

రవాణా సదుపాయాలు:

కొత్తగూడెం రైల్వేస్టేషన్ ను “భద్రాచలం రోడ్డు “ అనే పేరుతో పిలుస్తారు. భద్రాచలం చేరుకోవడానికి ఇక్కడనుండే వెళ్ళవలెను. భద్రాచలం ఇక్కడి నుండి గంట ప్రయాణము. పాల్వంచ పట్టణం మీదుగా వెళ్ళవలసి వుంటుంది. కొత్తగూడెంకు హైదరాబాదు నుండి బస్సు ద్వారాగానీ, రైలు ద్వారాగానీ వెళ్ళవచ్చు. దీనిని చేరుకోవడానికి హైదరాబాదు నుండి అయితే ఐదు గంటలు, బెజవాడ నుండి అయితే నాలుగు గంటలూ పడుతుంది. కొత్తగూడెం నాలుగు దిక్కులా పచ్చని అడవులను చూడవచ్చు. పట్టణంలో చెప్పోకోదగ్గ ముఖ్య అంశము సింగరేణి సంస్థ గురించి, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఉండటం వలన కొత్తగూడెంకి బ్లాక్ గోల్డ్ నగరం అని పేరు. కొత్తగూడెం ధర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రానికి అధికశాతం విద్యుత్ ని అందిస్తుంది. ఇది పాల్వంచ పట్టణంలో ఉంది. అక్కడే నవ భారత్ ఇనుము సంస్థ కూడా ఉంది.

భౌద్ధం ఆనవాళ్ళు:

కొత్తగూడెం మండలం హేమచంద్రాపురంగ్రామంలోని కారుకొండగుట్ట లకు ఘనమైన చరిత్ర ఉంది. రాతితో బుద్ధుడు పద్మాసనంలో కూర్చొని ఉండటం.. ఇక్కడి ప్రత్యేకత. వీటితో పాటు ఈ గుట్టపై అతి పెద్ద సొరంగం కూడా ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. ఈ కొండకు ఆగ్నేయంగా రెండు బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి. ఒకే రాయిపై 4 వైపులా బుద్ధుని ప్రతిమలు చెక్కి ఉన్నాయి. ఇక్కడ చరిత్ర నిక్షిప్తమై ఉన్నట్లు ప్రభుత్వం 1989లోనే గుర్తించి నిర్ధారించింది.